||భగవద్గీత ||

||ద్వాదశోధ్యాయః||

|| భక్తి యోగము - శ్లోకాలు - అర్థ తాత్పర్యాలతో||


||ఓమ్ తత్ సత్||

అర్జున ఉవాచ||
"ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః "||

'ఈవిధముగా ఎల్లప్పుడూ మీయందే మనస్సు గలవారై మిమ్ములను ఉపాశించు భక్తులు, ఇంద్రియగోచరముకాని అక్షరపరబ్రహ్మమును ఉపాశించే భక్తులు - వీరిద్దరిలోనూ ఎవరు యోగమును ఎక్కువతెలిసినవారు ఎవరు?'

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
భక్తియోగము
ద్వాదశోధ్యాయము

భక్తి యోగము మీద, ముందు మాట లాగా శంకరాచార్యులవారు తమ భాష్యములో ఇలా చెపుతారు. "రెండవ ఆధ్యాయము నుంచి విభూతి యోగము దాకా, అక్షర పరబ్రహ్మము యొక్క ఉపాసన మీద చెప్పడమైనది. అక్కడక్కడ భగవంతుని ఉపాసన కూడా చెప్పడమైనది. విశ్వరూప అధ్యాయములో , "విశ్వరూపం త్వదీయం దర్శితం ఉపాసనార్థమేవ త్వయా", అంటే " ఉపాసన చేయడానికి నీ చేత విశ్వరూపము చూపబడినది". ఆ విశ్వరూపము చూపించిన తరువాత చివరి శ్లోకములో, "మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంఙ్గవర్జితః", అంటే నాకొఱకై కర్మలు చేయు వాడు నన్నే పరమ గతిగా నమ్మినవాడు అట్టివాడు నన్నే పొందుతున్నాడు అని చెప్పబడినది. ఈ రెండు మార్గములలో ( అక్షరోపాసన అంటే నిర్గుణోబ్రహ్మోపాసన , సగుణ బ్రహ్మోపాసనలలో ) ఏది ఉత్తమమైనదో తెలిసికొనడము కోసము అర్జునుడి ప్రశ్నతో భక్తి యోగము మొదలవు తుంది" అని.

భక్తి యోగము ద్వాదశాధ్యాయము లో మొదటి శ్లోకము అదే ప్రశ్న.

శ్లోకము 1
అర్జున ఉవాచ||
ఏవం సతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః||1||

స||ఏవం సతతయుక్తాః యే భక్తాః త్వాం పర్యుపాసతే యే చ అపి అవ్యక్తం అక్షరం పర్యుపాసతే తేషాం కే యోగవిత్తమాః||1||

శ్లోక ప్రతిపదార్థములు:

ఏవం సతతయుక్తాః - ఈ విధముగా ఎల్లప్పుడు నీ యందు మనస్సు కలవారై
యే భక్తాః త్వాం పర్యుపాసతే - ఏ భక్తులు నిన్ను ఉపాశించెదరో
యే అవ్యక్తం అక్షరం పర్యుపాసతే చ -ఎవరు అవ్యక్తమైన నాశనములేనివానిని ఉపాశించెదరో
తేషాం కే యోగవిత్తమాః - వారిలో ఎవరు యోగమును బాగుగా ఎరిగినవారు?

శ్లోక తాత్పర్యము:

అర్జునుడు పలికెను:
"ఈ విధముగా ఎల్లప్పుడు నీ యందు మనస్సు కలవారై ఏ భక్తులు నిన్ను ఉపాశించెదరో,
ఏ భక్తులు అవ్యక్తమైన నాశనములేని వానిని ఉపాశించెదరో, వారిద్దరిలో ఎవరు యోగమును బాగుగా ఎరిగినవారు?"||1||

ఇక్కడ రెండు రకముల భక్తులు గురించి చెప్పబడడమైనది. ఒక పక్క భగవంతుని శరణము కోరి, భగవంతునినే అరాధించు వారు. రెండవ వేపు ఇంద్రియములకు గోచరము కాని నిరాకారమైన సర్వవ్యాపకమైన అక్షర పరమాత్మను ధ్యానించువారు. భగవానుని సాకారస్వరూపమును భక్తితో ఉపాసించిన వారు గొప్పా లేక ఇంద్రియ గోచరము కాని నిరాకార అక్షరపరమాత్మను ఉపాశించుట గొప్పా? ఈ రెండిటిలో ఏది శ్రేష్టము, అని అర్జునుని ప్రశ్న.

దానికి సమాధానముగా కృష్ణుడు ఇలా చెపుతాడు.

శ్లోకము 2

శ్రీభగవానువాచ||
మయ్యావేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయాపరయోపేతాః తే మే యుక్తతమా మతాః||2||

స|| మయి మనః ఆవేశ్య నిత్యయుక్తాః పరయా శ్రద్ధయా ఉపేతాః యే మాం ఉపాసతే తే యుక్తతమాః ( ఇతి) మే మతాః||2||

శ్లోక ప్రతిపదార్థములు:
యే మయి మనః ఆవేశ్య- ఎవరు నాయందు మనస్సు నిలిపి
నిత్యయుక్తాః - నిరంతర దీక్షతో
పరయా శ్రద్ధయా ఉపేతాః - మిక్కిలి శ్రద్ధతో కూడికొనినవారై
మాం ఉపాసతే - నన్ను ఉపాశించెదరో
తే యుక్తతమాః ( ఇతి) - అట్టి వారు ఉత్తమమైన దీక్షకలవారు అని
మే మతాః - నా అభిప్రాయము

శ్లోక తాత్పర్యము:

"ఎవరు నాయందు మనస్సు నిలిపి నిరంతర దీక్షతో మిక్కిలి శ్రద్ధతో కూడికొనినవారై నన్ను ఉపాశించెదరో,
అట్టి వారు ఉత్తమమైన దీక్షకలవారు అని నా అభిప్రాయము".||2||

'నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు' అని భగవానుడు చెప్పెను. విశ్వరూప సందర్శన యోగములో ఆఖరి మాట కూడా ఇదే. ' మద్భక్తః .. స మామేతి'(11.55) అంటూ 'నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైనవాడు నన్నే పొందుతాడు" అని చెపుతాడు.

ఇక్కడ మూడు మాటలు చెప్ప బడ్డాయి (1) మనస్సు భగవంతుని యందు నిలపడము (2) నిత్య యుక్తా అంటే నిరంతరము దైవ చింతనలో ఉండడము (3) శ్రద్ధయా అంటే శ్రద్ధతో ఉపాసన చెయ్యడము. ఈ మూడు సాధకునకు కావలసిన సాధనములు. సాధకుడు నిర్గుణో పాసకుడు అయినా సగుణోపాసకుడు అయినా ఈ మూడూ కావలసిన సాధనములే. కృష్ణుడు ఈ మూడు సాధనములతో ఉపాశించువాడు ఉత్తముడు అని.

అయితే , "యే మాం ఉపాసతే" అంటే "ఎవరు నన్ను ఇలా ఉపాశిస్తారో " వారు ఉత్తములు అని చెప్పడమైనది. ఇక్కడ శంకరాచార్యులవారు తమ భాష్యములో - " మయి విశ్వరూపే పరమేశ్వరే ఆవేశ్య మనః ... యే భక్తాః మాం సర్వజ్ఞం ... ఉపాసతే". అంటే "విశ్వరూపముగల సర్వజ్ఞు డైన తన మీద మనస్సు నిలిపి", శ్రద్ధతో ఎవరు ఉపాసిస్తారో వారు ఉత్తములు అని. అంటే ఇక్కడ సగుణాత్మక రూపమైన ఈశ్వరుని ఉపాశించే వారు ఉత్తములు అని చెప్పడమైనది. అయితే నిర్గుణ బ్రహ్మను ఉపాశించువారి గురించి ఏమి చెప్పబడలేదు.

విశ్వరూప సందర్శన యోగములో ఆఖరి మాట కూడా ఇదే. ' మద్భక్తః .. స మామేతి'(11.55) అంటూ 'నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైనవాడు నన్నే పొందుతాడు" అని చెపుతాడు.

నిర్గుణోపాసన చేసేవారి గురించి ప్రత్యేకముగా, మూడు నాలుగొవ శ్లోకాలలో కృష్ణభగవానుడు ఇలా చెపుతున్నాడు.

శ్లోకము 3,4

యే త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ధ్రువమ్||3||
సంనియమేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః||4||

స|| యే తు ఇన్ద్రియగ్రామమ్ సంనియమ్య సర్వత్ర సమబుద్ధయః సర్వభూతహితే రతాః అనిర్దేశ్యం అవ్యక్తం అచిన్త్యం కూటస్థం అచలం ధ్రువం సర్వత్రగం చ అక్షరమ్ ( మామ్) పర్యుపాసతే తే మామ్ ఏవ ప్రాప్నువన్తి||3,4||

శ్లోక ప్రతిపదార్థములు:

యే తు ఇన్ద్రియగ్రామమ్ - ఎవరైతే ఇన్ద్రియ సమూహములను
సంనియమ్య- అధీనములో వుంచుకొని
సర్వత్ర సమబుద్ధయః - అంతటయును సమాన భావము కలవారై
సర్వభూతహితే రతాః - సమస్త ప్రాణుల హితమునందు ఆసక్తి కలవారై
అనిర్దేశ్యం - ఇట్టిదని సూచింప నలవి కాని
అవ్యక్తం- అవ్యక్తము మైన
అచిన్త్యం - చింతింపనలవి కాని
కూటస్థం- కూటస్థములో వున్న
అచలం ధ్రువం సర్వత్రగం - చలించని నిత్యమైన సర్వత్రవ్యాపించిన
అక్షరమ్ పర్యుపాసతే - నాశనము లేని ( అక్షర పరబ్రహ్మమును) ఉపాశించెదరో
తే మామ్ ఏవ ప్రాప్నువన్తి- అట్టివారు నన్నే పొందుదురు.

శ్లోక తాత్పర్యము:

"ఎవరైతే ఇన్ద్రియ సమూహములను అధీనములో వుంచుకొని,అంతటయును సమాన భావము కలవారై, సమస్త ప్రాణుల హితమునందు ఆసక్తి కలవారై, ఇట్టిదని సూచింప నలవి కాని , అవ్యక్తము మైన, చింతింపనలవి కాని,
కూటస్థములో వున్న, చలించని, నిత్యమైన, సర్వత్రవ్యాపించిననాశనము లేని ( అక్షర పరబ్రహ్మమును)
ఉపాశించెదరో అట్టివారు నన్నే పొందుదురు."||3,4||

ఇది అక్షరపరబ్రహ్మమును ఉపాశించువారి గురించి.

'ఇంద్రియములను నియమించి సర్వత్ర సమబుద్ధి కలిగి సర్వప్రాణులకు మేలు చేస్తూ అనిర్దేశ్యము, అవ్యక్తము. సర్వవ్యాపకము అచింత్యము కూటస్థము అచలము ధ్రువము అయిన అక్షరబ్రహ్మము ను ఉపాశించువారు,- "మాం తే ప్రాప్నువన్తి" అంటే వారు నన్నే పొందుదురు అని. అక్షరోపాసన చేసే జ్ఞానులగురించి ముందే చెప్పబడినది, జ్ఞానవిజ్ఞానయోగములో ( 7 వ అధ్యాయములో) , "జ్ఞానీతు ఆత్మ ఏవ" అంటే జ్ఞానీ తను వేరు కాదని చెప్పాడు.
శంకరాచార్యులవారు తమ భాష్యములో ఇలా రాస్తారు."నహి భగవత్స్వరూపాణాం యుక్తతమత్వం అయుక్తతమత్వం వా వాచ్యమ్". అంటే,"భ్హగవత్స్వరూపము పోందిన వారిని, వారు ఉత్తమ యోగులా కాదా అన్న ప్రశ్నకి తావులేదు". ఎందుకు అంటే, వారు భగవత్స్వరూపము పొందినవారు కనక.

రెండవ శ్లోకములో "ఎవరు నాయందు మనస్సు నిలిపి నిరంతర దీక్షతో మిక్కిలి శ్రద్ధతో కూడికొనినవారై నన్ను ఉపాశించెదరో, అట్టి వారు ఉత్తమమైన దీక్షకలవారు అని నా అభిప్రాయము" అని చెప్పి, నిర్గుణ బ్రహమును ఉపాశించువారు జ్ఞానులు అని, కైవల్య స్థితిలో జ్ఞాని తను వేరుకాదని చెప్పడముతో, అట్టి వారు భగవత్స్వరూపులు అని అర్థము అవుతుంది. శంకరాచార్యులు వారు చెప్పినట్లు భవత్స్వరూపులను, వారు ఉత్తమయోగులా కాదా అనే ప్రశ్నకి తావు లేదు అని మనకి విదితమౌతుంది. వాళ్ళు కూడా ఉత్తమయోగులే.

అర్జునుడు అడిగిన ప్రశ్నకి సగుణో పాసకులు ఉత్తములు అని, నిర్గుణోపాసకులు తననే పొందుతారు అని చెప్పడముతో ఇద్దరూ ఉత్తములే అని అన్నట్టు అన్నమాట.

శ్లోకము 5

క్లేశోఽధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసామ్|
అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే||5||

స||అవ్యక్తాసక్త చేతసాం తేషాం క్లేశః అధికతరః హి అవ్యక్తా గతిః దేహవద్భిః దుఃఖమ్ అవాప్యతే|| 5||

శ్లోక ప్రతిపదార్థములు:

అవ్యక్తాసక్త చేతసాం - అవ్యక్త మైన పర్మాత్మయందు మనస్సు గలవారికి
తేషాం క్లేశః అధికతరః - వారికి కష్టము అధికతరమైనది.
అవ్యక్తా గతిః - అవ్యక్తమైన పరమాత్ముని పొందు మార్గము
దేహవద్భిః - దేహాభిమానము కలవారికి
దుఃఖమ్ అవాప్యతే - అతి కష్ఠముతో పొందబడుచున్నది.

శ్లోక తాత్పర్యము:

"అవ్యక్త మైన పరమాత్మయందు మనస్సు గలవారికి పరమాత్మను పొందు మార్గము వారికి అధికతరముగా కష్టము.
ఏల అనగా అవ్యక్తమైన పరమాత్ముని పొందు మార్గము దేహాభిమానము కలవారికి అతి కష్ఠముతో పొందబడుచున్నది."

ఇక్కడ దేహాభిమానము కలవారికి నిర్గుణోపాసన, ఇంకా ఎక్కువ కష్టము అని. ఎందుకు? "దేహాభిమానపరిత్యాగ నిమిత్తః" - వాళ్ళు ముందు దేహాభిమానము త్యజించాలి కనుక. అది కష్ఠమైన పని.

శ్లోకము 6,7

యేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః|
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే||6||
తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ |
భవామి న చిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్||7||

స|| హే పార్థ ! యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః అనన్యేన యోగేన మాం ఏవ ధ్యాయన్తః ఉపాసతే మయి ఆవేశిత చేతసామ్ తేషాం అహం మృత్యుసంసార సాగరాత్ న చిరాత్ సముద్ధర్తా భవామి||6,7||

శ్లోక ప్రతిపదార్థములు:
యేతు సర్వాణి కర్మాణి - ఎవరైతే సమస్త కర్మలు
మయి సన్న్యస్య - నాకు సమర్పించి
మత్పరాః- నన్నే పరమగతిగా తలచినవారై
అనన్యేన యోగేన - ఇంకేమీ యోగము తలంపని ధ్యాసతో
మాం ఏవ ధ్యాయన్తః ఉపాసతే - నన్నే ధ్యానించుచూ ఉపాసించుచున్నారో
మయి ఆవేశిత చేతసామ్ - నాయందు మనస్సుగల ( అట్టివారిని)
అహం మృత్యుసంసార సాగరాత్ - నేను మృత్యురూపమైన సంసార సాగరమునుండి
న చిరాత్ సముద్ధర్తా - శీఘ్రముగా ఉద్ధరించినవాడను ( అగుదును)
భవామి- అగుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ఓ పార్థా, ఎవరైతే సమస్త కర్మలు నాకు సమర్పించి, నన్నే పరమగతిగా తలచినవారై.
ఇంకేమీ యోగము తలంపని ధ్యాసతో నన్నే ధ్యానించుచూ ఉపాసించుచున్నారో
నాయందు మనస్సుగల అట్టివారిని,
నేను మృత్యురూపమైన సంసార సాగరమునుండిశీఘ్రముగా ఉద్ధరించినవాడను అగుదును."||6,7||

అంటే సర్వకర్మలు నా యందు సన్న్యసించి నన్నే పరమగతిగా భావించి మనస్సును నా యందు నిలబెట్టి అనన్య యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారిని, మృత్యరూపమైన సంసారసాగరమునుంచి వెంటనే రక్షిస్తాను అని. అందుకని మనస్సు నాయందే నిలుపుము అని అర్థము. అదే కృష్ణుని సందేశము.

శ్లోకము 8

మయ్యేవ మన ఆధత్స్వ మయిబుద్ధిం నివేశయ|
నివషిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||8||

స|| మయి ఏవ మనం ఆధత్స్వ మయి బుద్ధిమ్ నివేశయ అతః ఊర్ధ్వమ్ మయి ఏవ నివశిష్యసి||8||

శ్లోక ప్రతిపదార్థములు:

మయ్యేవ మన ఆధత్స్వ -నాయందే మనస్సుని నిలుపుము
మయిబుద్ధిం నివేశయ - నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము
అత ఊర్ధ్వం - అటుపిమ్మట
నివషిష్యసి మయ్యేవ - నాయందే నివసించగలవు
న సంశయః - సందేహము లేదు.

శ్లోక తాత్పర్యము:

"నాయందే మనస్సుని నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము
అటుపిమ్మట నాయందే నివసించగలవు. అందులో సందేహము లేదు."||8||

అంటే మనస్సు నాయందే నిలుపు, నామీదనే బుద్ధిని ఉంచుము. ఆ పై నా లోనే ఉంటావు. అందులో సందేహము లేదు. ఇది కూడా భగవంతుని హామీ. భవంతుని పై మనస్సు నిలపకలగాలి.

"మయ్యేవ మన ఆధత్స్వ" అన్న పదాన్ని శంకరాచార్యులవారు ఇలా విడమస్తారు. "మయి విశ్వరూపే ఈశ్వరే సంకల్పవికల్పాత్మకం మనః సమాధత్స్వ స్థాపయ" అంటే నీ " సంకల్ప వికల్పాలలో పోయే మనస్సును ఈశ్వరుడగు నా విశ్వరూపములో స్థాపించుము" అని. అలా చేస్తే నీవు శరీరము వదిలినప్పుడు ఈశ్వరుని లోనే వశిస్తావు అని. అందులో సంశయము లేదు.

మరి అలా మనస్సు నిలపలేకపోతే ఏమి చెయ్యాలి. దానికి సమాధానము "అభ్యాసము చెయ్యి" అని. అది తొమ్మిదవ శ్లోకములో వింటాము.

శ్లోకము 9

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మాం ఇఛ్చాప్తుం ధనంజయ||9||

స|| ధనంజయ ! అథ చిత్తమ్ మయి స్థిరం సమాధాతుం న శక్నోషి తతః అభ్యాసయోగేన మాం ఆప్తుం ఇఛ్చ ||9||

శ్లోక ప్రతిపదార్థములు:
అథ చిత్తం - మరి మనస్సుని
మయి స్థిరం సమాధాతుం - నా లో స్థిరముగా నిలుపుటకు
న శక్నోషి - శక్తి లేకపోయినచో
తతః అభ్యాసయోగేన- అప్పుడు అభ్యాసమనే యోగముతో
మాం ఆప్తుం ఇఛ్చ - నన్ను పొందుటకు కోరుము

శ్లోక తాత్పర్యము:

" మరి మనస్సుని నా లో స్థిరముగా నిలుపుటకు శక్తి లేకపోయినచో,
అప్పుడు అభ్యాసమనే యోగముతో నన్ను పొందుటకు ప్రయత్నించుము." ||9||

అంటే కృష్ణుడు ఇక్కడ , మనస్సు స్థిరముగా ఉంచుకోడము మాచేత కాదేమో అని భయపడేవారికి, మనస్సు నిగ్రహించుకోడానికి అభ్యాసము అనే మార్గము చూపిస్తున్నాడు. అభ్యాసము అంటే మనస్సు ఇతర విషయాల నుంచి మళ్ళించి, మళ్ళీ భాగవత్ చింతనమీదకు తీసుకు మళ్ళీ మళ్ళీ రావడము. అదే అభ్యాసము.

మరి అది కూడా కష్ఠము అయితే ఇంకోమార్గము కూడా చెపుతాడు పదవ శ్లోకములో.

శ్లోకము 10

అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి||10||

స|| అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరః భవ | మదర్థమ్ కర్మాణి కుర్వన్నపి సిద్ధిం అవాప్స్యసి||10||

శ్లోక ప్రతిపదార్థములు:

అభ్యాసేఽప్యసమర్థోఽసి - అభ్యాసము చేయడములో కూడా అసమర్థుడవు అయితే
మత్కర్మ పరః భవ - నాకు సంబంధించిన కర్మలు చేయడములో ఆసక్తి కలవాడవు అగుము.
మదర్థమపి కర్మాణి కుర్వన్ - నాకోసము కర్మలను చేయుచూ కూడా
సిద్ధిం అవాప్స్యసి- సిద్ధిని పొందగలవు.

శ్లోక తాత్పర్యము:
"అభ్యాసము చేయడములో కూడా అసమర్థుడవు అయితే
నాకు సంబంధించిన కర్మలు చేయడములో ఆసక్తి కలవాడవు అగుము.
నాకోసము కర్మలను చేయుచూ కూడా సిద్ధిని పొందగలవు".||10||

మరి అభ్యాసము చేయడానికి కూడా అసమర్థుడు అయితే ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకి, 'మత్కర్మపరమోభవ' - నా( భగవంతుని) సంబంధమగు కర్మలయందు ఆసక్తి కలవాడు అగుము అని. అంటే కర్మలు చేస్తూ సిద్ధిని పొందవచ్చు అన్నమాట.

అంటే దాన ధర్మములు వ్రతపూజలు నిత్య నైమిత్తిక కర్మలు దైవభావముతో ఆచరించి ఈశ్వరార్పణ లేక కృష్ణార్పణ లేక రామార్పణ బుద్ధితో చేయవలెను. తాను నడచుచున్నచో ప్రదక్షిణమని భావించవలెను. తాను మాట్లాడుచున్నచో దైవసంకీర్తనమని, ఏ పనిచేయుచున్ననూ భగవత్ స్మృతికలిగి "మామనుస్మరయుధ్యచ" అని భగవానుడు చెప్పినటుల తానాచరించు ఆయాకర్మలు ఈశ్వరార్పణముగావించి నచో చిత్తశుద్ధి కలుగ గలదు. జ్ఞానోదయము గలుగగలదు.

శ్లోకము 11

అథైతత్ అప్యసక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||11||

స|| అథ మద్యోగం ఆశ్రితః ఏతత్ అపి కర్తుం అశక్తః అసి తతః యతాత్మవాన్ సర్వకర్మఫలత్యాగమ్ కురు||11||

శ్లోక ప్రతిపదార్థములు:

అథ మత్ యోగం ఆశ్రితః -
ఇక నన్ను గురించిన యోగమును ఆశ్రయించినవాడవై
ఏతత్ అపి కర్తుం అశక్తః అసి -
ఇది కూడా ఆచరించుటకు అశక్తుడవు అయితే
తతః యతాత్మవాన్ - అప్పుడు నియమింఫబడిన మనస్సు కలవాడవై
సర్వకర్మఫలత్యాగమ్ కురు- సమస్త కర్మఫలములను త్యజింపుము.

శ్లోక తాత్పర్యము:

"ఇక నన్ను గురించిన యోగమును ఆశ్రయించినవాడవై,
ఇది కూడా ఆచరించుటకు అశక్తుడవు అయితే
అప్పుడు అప్పుడు నియమింఫబడిన మనస్సు కలవాడవై సమస్త కర్మఫలములను త్యజింపుము".||11||

అదికూడా చేయలేకపోతే చేస్తున్న కర్మలను భగవంతునియందు సన్న్యసించి సర్వకర్మఫలత్యాగము చేయుము అంటాడు.(11.11) అంటే మళ్ళీ కృష్ణుడు చివరికి సర్వకర్మఫలత్యాగమే మోక్షమునకు ఒక సాధనముగా చెపుతాడు.

అ సర్వకర్మఫలత్యాగము ను స్తుతిస్తో భగవానుడు ఇలా చెపుతాడు పన్నెండవ శ్లోకములో.

శ్లోకము 12

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానంవిశిష్యతే|
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాన్తిరనన్తరమ్ ||12||

స||అభ్యాసాత్ జ్ఞానమ్ శ్రేయః హి| జ్ఞానాత్ ధ్యానమ్ విశిష్యతే | ధ్యానాత్ కర్మఫలత్యాగః విశిష్యతే| త్యాగాత్ అనన్తరమ్ శాన్తిః భవతి||12||

శ్లోక ప్రతిపదార్థములు:

అభ్యాసాత్ జ్ఞానమ్ శ్రేయః హి - అభ్యాసము కన్న జ్ఞానము శ్రేష్ఠమైనది
జ్ఞానాత్ ధ్యానమ్ విశిష్యతే - జ్ఞానము కన్న ధ్యానము విషిష్ఠమైనది.
ధ్యానాత్ కర్మఫలత్యాగః విశిష్యతే - ధ్యానము కన్న కర్మ ఫలత్యాగము విశిష్థమైనది,
త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ - త్యాగాత్ శాంతి అనంతరం
త్యాగము చేసిన తరువాత శాంతి లభించును.

శ్లోక తాత్పర్యము:

"అభ్యాసము కన్న జ్ఞానము శ్రేష్ఠమైనది, జ్ఞానము కన్న ధ్యానము విశిష్ఠమైనది
ధ్యానము కన్న కర్మ ఫలత్యాగము విశిష్థమైనది. త్యాగము చేసిన తరువాత శాంతి లభించును"||12||

ఇక్కడ, అభ్యాసము కన్నా జ్ఞానము శ్రేష్ఠము అంటే, వివేకరహిత అభ్యాసము కన్న జ్ఞానము విశిష్ఠము. "జ్ఞానాత్ ధ్యానమ్ " అంటే "జ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానమ్", జ్ఞానము కన్నా జ్ఞానము తో కూడిన ధ్యానము విశిష్ఠము అని.

శ్లోకము 12.02 లో, "నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు" అని మొదలుపెట్టి, చివరికి మనస్సులోని దోషాలు పోవడముతో శాంతి లభిస్తుంది(12.12) అన్నమాటవరకు వచ్చిన సందర్బాన్ని మళ్ళీ ఒకమాటు పూర్తిగా చూద్దాము.

విశ్వరూప సందర్శనమయిన తరువాత అర్జునిడికి వచ్చిన సందేహము - 'భగవానుని సాకారస్వరూపమును భక్తితో ఉపాసించిన వారు గొప్పా లేక ఇంద్రియ గోచరము కాని నిరాకార అక్షరపరమాత్మను ఉపాశించుట గొప్పా? ఈ రెండిటిలో ఏది శ్రేష్టము', అని . దానికి సమాధానముగా కృష్ణుడు "నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు" అని చెప్పెను. మరి భగవంతుని పై మనస్సు నిలిపి తదేకనిష్టతో తదేక చింతాపరులై మిక్కిలిశ్రద్ధకలవారు ఉత్తములే , వారికి భగవంతుడు ఏమి చేస్తాడు అన్న ప్రశ్న ఉదయించింది.
వారికి - "అంటే సర్వకర్మలు నా యందు సన్న్యసించి నన్నే పరమగతిగా భావించి మనస్సును నా యందు నిలబెట్టి అనన్య యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారికి మృత్యరూపమైన సంసారసాగరమునుంచి వెంటనే రక్షించువాడను" అని. ఇందులో "న సంశయః" అంటూ , ఎవరైతే ఉత్తములు అన్నాడో వారందరికి హామీ ఇస్తున్నాడు మృత్యుసంసారసాగరాన్నించి దాటించ డానికి.

అయితే అలా చిత్తాన్ని అంటే మనస్సును స్థిరముగా భగవానునిపై అందరూ వుంచలేరుగదా , అలాఉంచ లేకపోతే వారు ఏమి చెయ్యాలి. దానికి సమాధానము వారు ఆభ్యాసము చేసి మనస్సును స్థిరపరచాలి. అయితే అభ్యాసము చేయడానికి కూడా అసమర్థుడు అయితే ఏమి చెయ్యాలి? భగవంతుని సంబంధమగు కర్మలయందు ఆసక్తి కలవాడు అవ్వాలి. అంటే దైవకార్యములు నిష్కామబుద్ధితో ఆచరించడము . తద్వారా చిత్తశుద్ధిని మోక్షమును పొందడము. అంటే భగవంతుని కొఱకు కర్మలు చేస్తూకూడా సిద్ధి పొందవచ్చు అన్నమాట.

అదికూడా చేయలేకపోతే చేస్తున్న కర్మలను భగవంతునియందు సన్న్యసించి సర్వకర్మఫలత్యాగము చేయుము అంటాడు. అంటే దాన ధర్మములు వ్రతపూజలు నిత్య నైమిత్తిక కర్మలు దైవభావముతో ఆచరించి ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను, ఏపనిచేయుచున్ననూ భగవత్ స్మృతికలిగి "మామనుస్మరయుధ్యచ" అని భగవానుడు చెప్పినటుల తానాచరించు ఆయాకర్మలు ఈశ్వరార్పణముగావించి నచో చిత్తశుద్ధి కలుగ గలదు. జ్ఞానోదయము గలుగగలదు.

అంటే మళ్ళీ కృష్ణుడు చివరికి సర్వకర్మఫలత్యాగమే మోక్షమునకు ఒక సాధనముగా చెపుతాడు.అ సర్వకర్మఫలత్యాగము ను స్తుతిస్తో భగవానుడు ఇలా చెపుతాడు: 'అభ్యాసముకన్న జ్ఞానము, జ్ఞానముకన్న ధ్యానము, ధ్యానము కన్న కర్మఫలత్యాగము విశిష్ఠమైనవి. త్యాగము వలన వెంటనే శాంతి కలుగును".

ఇక్కడ మనకు అర్థము అయ్యేది కర్తృత్వత్యాగము వలన అహంకార త్యాగము వలన దోషత్యాగము వలన ప్రాపంచిక విషయ సుఖత్యాగము వలన శాంతి లభిస్తుంది . అంటే మనస్సులోని దోషాలు పోవడము తో శాంతి లభిస్తుంది అన్నమాట.

ఇక్కడ శంకరాచార్యులవారు సగుణో పాసకులు, నిర్గుణో పాసకులలో తారతమ్యము విశదీకరిస్తూ ఒక మాట చెపుతాడు. "తే ప్రాప్నువన్తి మామేవ ఇతి అక్షరోపాసకానాం కైవల్యప్రాప్తౌ స్వాతంత్ర్యం ఉక్త్వా, ఇతరేషామ్ పారతంత్ర్యాత్ ఈశ్వరాధీనతాం దర్శితవాన్ ,"తేషాం అహమ్ సముద్ధర్తా ఇతి" అని. అంటే "అక్షరోపాసకులకు వారు నన్ను పొందుతారు అంటూ కైవల్యప్రాప్తిలో వారి కున్న స్వాతంత్ర్యము చూపుతూ, సగుణోపాసకులమీద " నేను వారిని మృత్యుసంసార సాగరమునుంచి ఉద్ధరిస్తాను " అంటూ ఈశ్వరుని పై ఆధారపడిన సగుణోపాసకుల ఈశ్వరాధీనతమును కూడా ప్రకటిస్తున్నాడు అని అంటారు.

అంటే నిర్గుణోపాసకులు వారంతటవారే కైవల్యము పొందుతారు అని, సగుణోపాసకులు భగవంతుని మీద ఆధారపడిన వారు అని . వారిని ఈశ్వరుడే మృత్యు సంసారసాగరము నుండి ఉద్ధరిస్తాడు అని. అదే సగుణో పాసకుల, నిర్గుణో పాసకులలో తారతమ్యము.

ఇప్పుడు మనకి అక్షరోపాసకుడగు భక్తుని లక్షణముల గురించి చెప్పబడుతుంది

శ్లోకము 13,14

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ||13||
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పిత మనోబుద్ధిర్యోమద్భక్తః స మే ప్రియః||14||

స|| సర్వభూతానాం అద్వేష్ఠా మైత్రః కరుణః ఏవ చ నిర్మమః నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సతతం సంతుష్టః యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయి అర్పిత మనః బుద్ధిః మద్భక్తః యః సః మే ప్రియః ||

శ్లోక ప్రతిపదార్థములు:

సర్వభూతానాం అద్వేష్ఠా - సమస్త ప్రాణులయందు ద్వేషము లేని వాడు,
మైత్రః కరుణః ఏవ చ - మిత్రభావము కలవాడు, కరుణభావము కలవాడు
నిర్మమః నిరహంకారః - మమకారము లేని వాడు, అహంకారము లేని వాడు
సమదుఃఖసుఖః - సుఖదుఃఖములలో సమభావము కలవాడు
క్షమీ- ఓర్పు కలవాడును
సతతం సంతుష్టః - ఎల్లప్పుడు సంతృప్తి కలవాడు
యోగీ యతాత్మా - యోగములో వుండువాడు, మనస్సును స్వాధీనములో ఉంచుకొనినవాడు
దృఢనిశ్చయః- ధృఢ నిశ్చయము కలవాడును
మయి అర్పిత మనః బుద్ధిః - నాకు సమర్పించిన మనస్సు బుద్ధి కలవాడును
మద్భక్తః- నాయందు భక్తి కలవాడును
యః సః - ఎవడు కలడో అట్టి వాడు
మే ప్రియః - నాకు ప్రియుడు.

శ్లోక తాత్పర్యము:

సమస్త ప్రాణులయందు ద్వేషము లేని వాడు,
మిత్రభావము కలవాడు, కరుణభావము కలవాడు, మమకారము లేని వాడు, అహంకారము లేని వాడు
సుఖదుఃఖములలో సమభావము కలవాడు, ఓర్పు కలవాడును, ఎల్లప్పుడు సంతృప్తి కలవాడు,
యోగములో వుండువాడు, మనస్సును స్వాధీనములో ఉంచుకొనినవాడు, ధృఢ నిశ్చయము కలవాడును
నాకు సమర్పించిన మనస్సు బుద్ధి కలవాడును, నాయందు భక్తి కలవాడును
ఎవడు కలడో అట్టి వాడు నాకు ప్రియుడు.

ఇవన్నీ భక్తుని కి ఉండ వలసిన లక్షణములు. ముందు శ్లోకాలలో ఇంకా లక్షణములు చెప్ప బడతాయి.

శ్లోకము 15

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వెగైర్ముక్తో యస్స చ మే ప్రియః||15||

స|| యస్మాత్ లోకః న ఉద్విజతే లోకాత్ చ యః న ద్విజతే యః హర్ష అమర్ష భయ ఉద్వేగైః ముక్తః సః చ మే ప్రియః||15||

శ్లోక ప్రతిపదార్థములు:

యస్మాత్ లోకః న ఉద్విజతే - ఎవరి వలన లోకులు భయమును పొందరో
లోకాత్ చ యః న ఉద్విజతే - ఎవరు లోకుల వలన భయమును పొందడో
యః హర్ష అమర్ష భయ ఉద్వేగైః - ఎవడు హర్షము,క్రోధము, భయము, మనో వ్యాకుల వలన
ముక్తః- విడువబడిన వాడో
సః చ మే ప్రియః- అట్టివాడు నాకు ప్రియుడు.

శ్లోక తాత్పర్యము:

"ఎవరి వలన లోకులు భయమును పొందరో
ఎవరు లోకలు వలన భయమును పొందడో
ఎవడు హర్షము,క్రోధము, భయము, మనో వ్యాకుల వలన విడువబడిన వాడో
అట్టివాడు నాకు ప్రియుడు".||15||

శ్లోకము 16

అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః||16||

స||అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనః గతవ్యథః సర్వారంభపరైత్యాగీ మద్భక్తః యః సః మే ప్రియః||16||

శ్లోక ప్రతిపదార్థములు:

అనపేక్షః - ఆపేక్ష లేని వాడు
శుచిః దక్షః - బాహ్యాంతర శుద్ధి కలవాడు, కార్యసమర్థుడు,
ఉదాసీనః - ఉదాసీనుడు
గతవ్యథః - దుఃఖములు లేనివాడు
సర్వారంభపరైత్యాగీ- సమస్తకార్యములందు కర్తృత్వము లేని వాడు,
మద్భక్తః యః - నాభక్తుడు ఎవడు కలడో
యః సః మే ప్రియః- అట్టివాడు నాకు ప్రియుడు

శ్లోక తాత్పర్యము:

"ఆపేక్ష లేని వాడు, బాహ్యాంతర శుద్ధి కలవాడు, కార్యసమర్థుడు, ఉదాసీనుడు, దుఃఖములు లేనివాడు,
సమస్తకార్యములందు కర్తృత్వము లేని వాడు,నాభక్తుడు ఎవడు కలడో,
అట్టివాడు నాకు ప్రియుడు".||16||

శ్లోకము 17

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి|
శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః||17||

స|| యః న హృష్యతి న ద్వేష్టి న శోచతి నకాంక్షతి యః శుభాశుభపరిత్యాగీ సః భక్తిమాన్ మే ప్రియః||17||

శ్లోక ప్రతిపదార్థములు:

యః న హృష్యతి - ఎవడు సంతోషముతో ఉప్పొంగి పోడో
న ద్వేష్టి - ద్వేషింపడో
న శోచతి నకాంక్షతి - శోకమును పొందడో, కోరికలు కోరడో,
యః శుభాశుభపరిత్యాగీ - ఎవడు శుభాశుభములను వదిలిన వాడో
సః భక్తిమాన్ మే ప్రియః - అట్టి భక్తుడు నాకు ప్రియుడు.

శ్లోక తాత్పర్యము:

"ఎవడు సంతోషముతో ఉప్పొంగి పోడో, ద్వేషింపడో, శోకమును పొందడో,
కోరికలు కోరడో, ఎవడు శుభాశుభములను వదిలిన వాడో
అట్టి భక్తుడు నాకు ప్రియుడు."||17||

శ్లోకము 18

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః||18||

స|| శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః సమః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ( సః చ మే ప్రియః)||18||

శ్లోక ప్రతిపదార్థములు:

శత్రౌచ మిత్రేచ - శత్రువునందు మిత్రునియందు
తథా మానావమానయోః - అలాగే మాన అవమానములందు
సమః - సమముగా వుండువాడు
శీతోష్ణసుఖదుఃఖేషు సమః - శీతోష్ణసుఖదుఃఖములందు సమము గా వుండువాడు
సంగవివర్జితః- దేనియందు ఆసక్తి లేనివాడు
(సః చ మే ప్రియః)- (అట్టి భక్తుడు నాకు ప్రియుడు).

శ్లోక తాత్పర్యము:

"శత్రువునందు, మిత్రునియందు, అలాగే మాన అవమానములందు సమము గా వుండువాడు,
శీతోష్ణసుఖదుఃఖములందు సమము గా వుండువాడు, దేనియందు ఆసక్తి లేనివాడు
(అట్టి భక్తుడు నాకు ప్రియుడు)".||18||

శ్లోకము 19

తుల్యానిన్దస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేన చిత్|
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః||19||

స|| శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః సమః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః తుల్యనిందాస్తుతిః మౌనీ యేనకేనచిత్ సంతుష్టః అనికేతః స్థిరమతిః భక్తిమాన్ నరః మే ప్రియః||

శ్లోక ప్రతిపదార్థములు:

తుల్యనిందాస్తుతిః - నిందా స్తుతులయందు సమముగా వుండు వాడు
మౌనీ- మౌనము గా వుండువాడు
యేనకేనచిత్ సంతుష్టః - దేని చేతనైన తృప్తి చెందు వాడు
అనికేతః - గృహాదులందు ఆసక్తి లేనివాడు
స్థిరమతిః - స్థిరమైన బుద్ధి కలవాడు
భక్తిమాన్ నరః - భక్తిగలవాడు నరుడు
మే ప్రియః- నాకు ఇష్టుడు

శ్లోక తాత్పర్యము:

"నిందా స్తుతులయందు సమముగా వుండు వాడు, మౌనము గా వుండువాడు, దేని చేతనైన తృప్తి చెందు వాడు,
గృహాదులందు ఆసక్తి లేనివాడు, స్థిరమైన బుద్ధి కలవాడు
భక్తిగలవాడగు నరుడు నాకు ఇష్టుడు."||19||

ఇక్కడ ఏడు శ్లోకాలలో ( 12.12-12.19) కృష్ణుడు భక్తుని లక్షణములు వివరించెను. ఆ లక్షణములు ఇవి.

ఏ ప్రాణినీ ద్వేషించకుండుట, మైత్రి, కరుణ కలిగి యుండుట, మమత్వము లేకుండుట, అహంకారము లేకుండుట, సుఖదుఃఖములయందు సమత్వము, ఓర్పు, నిత్య సంతుష్టి , మనోనిగ్రహము, ధృఢనిశ్చయము, మనోబు ద్ధులను భగవంతునికి సమర్పించుట, లోకమువలన తనకి గానీ తన వలన లోకమునకు గానీ భయము లేకుండుట, హర్షము క్రోధము, భయము లేకుండుట, దేనియందును ఆపేక్ష లేకుండుట, శుచిత్వము కలిగియుండుట, కార్యసామర్ధ్యము, ఉదాసీనుడు, మనోవ్యాకులత్వము లేనివాడు, సర్వకర్మఫలత్యాగము, కోరిక లేకుండుట,ద్వేషములేకుండుట, శోకములేకుండుట, శుభాశుభ పరిత్యాగము, శతృమితృలందు సమత్వము, సంగవివర్జితుడు, నిందా స్తుతులయందు సమముగానుండు వాడు, మౌనముకలిగియుండుట, దొరికినదాని తో సంతుష్టికలవాడు, నివాసమునందు అభిమానము లేనివాడు, స్థిరబుద్ధి భక్తి కలిగిన వాడు. ఇవన్నీ మంచి గుణములు. ఈ సుగుణములు కలవాడు భగవంతునికి ప్రీతిపాత్రుడు. (12.13-19)

శ్లోకము 20

యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః|| 20||

స|| యేతు శ్రద్ధధానాః మత్పరమాః ఇదం ధర్మ్యామృతమ్ యథోక్తం పర్యుపాసతే తే భక్తాః మే అతీవ ప్రియాః||20||

శ్లోక ప్రతిపదార్థములు:

యేతు శ్రద్ధధానాః - ఎవరైతే శ్రద్ధతో
మత్పరమాః- నన్నే పరమగతిగా నమ్మినవారై
ఇదం ధర్మ్యామృతమ్ - ఈ అమృతరూపమగు ధర్మమును,
యథోక్తం పర్యుపాసతే - ఎలా చెప్పబడినదో అలాగ ఉపాసించెదరో
తే భక్తాః - ఆ భక్తులు
మే అతీవ ప్రియాః- నాకు మిక్కిలి ప్రియులు.

శ్లోక తాత్పర్యము:

"ఎవరైతే శ్రద్ధతో నన్నే పరమగతిగా నమ్మినవారై,
ఈ అమృతరూపమగు ధర్మమును, ఎలా చెప్పబడినదో అలాగ ఉపాసించెదరో
ఆ భక్తులు నాకు మిక్కిలి ప్రియులు".||20||

అంటే పైన చెప్పబడిన అమృత రూపమగు ధర్మమును శ్రద్ధాభక్తులతో అనుష్టించువారు భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రులు. ఇది ఫలశ్రుతి.

ఏడవ ఆధ్యాయములో , "ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం" అంటే జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను అని చెప్పిన కృష్ణభగవానుడు, "అద్వేష్ఠాసర్వభూతానాం" అన్న శ్లోకమునుంచి ఏడు శ్లోకాలలో ఉత్తమ భక్తుల, నిర్గుణోపాసకుల లక్షణములు చెప్పి, ఆ విధముగా ఎవరు నన్ను ఉపాసిస్తారో వారు నాకు మిక్కిలి ఇష్టమైన భక్తులు అని చెపుతాడు.

ఇక్కడ చెప్పబడినవి భవంతుని కి ఇష్టమైన భక్తుల లక్షణాలు. ఆ లక్షణాలే సాధకునికి భగవంతునికి ఇష్టమైన భక్తుడు అగుటకు సాధనములు కూడా. అంటే ఈ గుణములన్ని సాధకులు , ముముక్షువులు అలవరుచుకోవాలి అని భగవంతుని సందేశము. ఈ గుణములు లేక లక్షణములు అలవరచుకొను వాడు, ఏ జాతి మత వర్ణాలకి సంభంధించినా, ఉత్తమ మానవుడు అవుతాడు అన్నమాటలో సందేహము లేదు.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగోనామ
ద్వాదశోఽధ్యాయః
ఓం తత్ సత్

 


|| om tat sat||